సాక్షి, వరంగల్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా ర్యాంకు మరింత దిగజారింది. గతేడాది 92.97 శాతంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 21వ ర్యాంకు సాధిస్తే.. ఈసారి 95.25 శాతం ఉత్తీర్ణత సాధించినా 23వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2026 పదో తరగతి పరీక్షలకు 9,492 మంది హాజరుకాగా 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్ఫూర్తి కార్యక్రమం ద్వారా అందరూ అధికారులను భాగస్వామ్యం చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించినా రాష్ట్రంలో జిల్లాకు సముచిత స్థానం రాకపోవడంతో అధికారులు నైరాశ్యంలో ఉన్నారు. ఎక్కడా లోటుపాట్లు జరిగాయి, ఏ సబ్జెక్టుల్లో ఎక్కువగా తప్పారనే దానిపై అధికారులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరంగా చూసుకున్నా ములుగు జిల్లా మొదటి స్థానం, వరంగల్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
బాలికలు 95.79, బాలురు 94.74 శాతం..
2025 పదో తరగతి ఫలితాల్లో 94.77 శాతంతో బాలికలు హవా కొనసాగించారు. ఈ ఏడాది కూడా 95.79 శాతంతో బాలికలు ఉత్తీర్ణతపరంగా బాలుర కన్నా ముందున్నారు. గతేడాది 91.31 శాతం మంది బాలురు పాసైతే ఈసారి 94.74 శాతం మంది ప్రతిభ కనబరిచారు. 2025 పదో తరగతి ఫలితాలతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా ఉమ్మడి వరంగల్ పరంగా చూసుకుంటే ఆరు జిల్లాల్లో అట్టడుగున ఉండడం కలవరపెడుతోంది.
మూడు కేజీబీవీల్లో 100 శాతం..
జిల్లాలో 10 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) ఉన్నాయి. 410 మందికి 394 మంది (96.09 శాతం) ఉత్తీర్ణత సాధించారు. దుగ్గొండి, నెక్కొండ, సంగెం కేజీబీవీల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయి. దుగ్గొండి కేజీబీవీలో 44 మంది, నెక్కొండ కేజీబీవీలో 26 మంది, సంగెం కేజీబీవీలో 48 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా ఖానాపురం కేజీబీవీకి చెందిన విద్యార్థిని అనూష 563 మార్కులు సాధించింది. అలాగే, జిల్లాలోని ఐదు తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 414 మంది ఉంటే 372 మంది (89.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సంగెం మండల గవిచర్ల మోడల్ స్కూల్‌లో 71 మందికి 71 మంది ఉత్తీర్ణులయ్యారు.
మైనారిటీ గురుకులాల్లో మెరుగైన ఫలితాలు..
జిల్లాలో ఐదు మైనారిటీ గురుకుల పాఠశాలలు ఐదు ఉండగా.. అందులో మూడు బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 232 మంది విద్యార్థులకు 227 మంది పాసయ్యారు. అంటే దాదాపు 97.84 శాతం ఉత్తీర్ణత వచ్చింది. వీటిలో కేయూ క్రాస్‌లో ఉన్న వరంగల్ గర్ల్స్–1 పాఠశాలలో 54 మంది, శంభునిపేటలోని వరంగల్ గర్ల్స్–2 పాఠశాలలో 47 మంది పాసై 100 శాతం ఫలితాలు సాధించారు. నర్సంపేట గర్ల్స్–1లో 47 మందికి 46, జక్కలొద్దిలోని వరంగల్ బాయ్స్–1లో 39 మందికి 38, వర్ధన్నపేట బాయ్స్–1లో 45 మందికి 42 మంది పాసయ్యారు. అత్యధికంగా వరంగల్ గర్ల్స్–2కు చెందిన విద్యార్థిని డి.రుచితకు 577 మార్కులు వచ్చాయి.
కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి 589 మార్కులు
కాళోజీ సెంటర్: వరంగల్ నగరంలోని కృష్ణాకాలనీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి ముదాసిర్ 589 మార్కులు సాధించాడని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. నెక్కొండ తెలంగాణ గురుకుల పాఠశాలకు చెందిన తుమ్మల వర్షిత 580 మార్కులు సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. జూన్ 5 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించారు. అదేవిధంగా రీ వెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1000 చొప్పున 15 రోజుల్లోపు చెల్లించాలని తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల ఫీజు సకాలంలో చెల్లించేలా ఆయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పదో తరగతి ఫలితాల్లోపడిపోయిన జిల్లా ర్యాంకు
9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు.. 9,034 (95.25 శాతం) మంది ఉత్తీర్ణత
గతంలో మాదిరిగానే ఈసారి బాలికలు ముందంజ
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు ఇలా..
రెగ్యులర్ విద్యార్థులు బాలురు బాలికలు మొత్తం
హాజరు 4,927 4,565 9,492
ఉత్తీర్ణత 4,665 4,369 9,034
ఉత్తీర్ణత శాతం 94.74 95.79 95.25


