న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సూర్యుడు సలసల..
తాగి నడిపితే తంటాలే!
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఇక అంతే సంగతులు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు.
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఆరు జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనాలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెండు వడదెబ్బ మరణాలు, అంతకుముందు రెండు ఘటనలు జరగడంతో హైరానా పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంచాలకురాలు దివ్యదేవరాజన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
హడలెత్తిస్తున్న వడదెబ్బ మరణాలు...
● వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గాదం వినయ్ కుమార్ (30) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 8న పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య (55) రోజువారీ కూలీ పనుల్లో భాగంగా పనికి వెళ్లగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు.
● హనుమకొండ జిల్లా దర్గా కాజీపేటకు చెందిన ఎండీ అఫ్జల్ (28) ఆదివారం పనికి వెళ్లి వచ్చి రోజులానే నిద్రకు ఉపక్రమించారు. డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బతో నిద్రలోనే మృతి చెందారు. ఈ నెల 10న భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ గ్రామానికి చెందిన బరిగెల శోభ (45) కోతులనడుమ గ్రామానికి సీడ్ పనులకు వచ్చి ట్రాక్టర్‌లో తిరిగి వెళ్తున్న క్రమంలో గోపాల్‌పూర్ వద్ద వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఉదయం 10 గంటల్లోపు పనులు పూర్తి చేసుకోవాలి. మళ్లీ సాయంత్రం ఐదు గంటల తర్వాత చేపట్టాలి. తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం, తలకు తెల్లని టోపీ, చెవులలోకి వేడి గాలి వెళ్లకుండా వస్త్రం, రుమాలు కట్టుకోవాలి. గొడుగు వాడితే మంచిది. ద్రవ పదార్థాలు, నీరు, తరచుగా ఓఆర్‌ఎస్ తీసుకోవాలి. వెంట కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపిన సాధారణ నీటి సీసా ఉంచుకోవాలి. వృద్ధులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీరసంగా ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ సాంబశివరావు,
జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి
నర్సంపేట: నిర్మానుష్యంగా ఉన్న పాకాల–మహబూబాబాద్ రోడ్డు
ఇప్పటికే నాలుగు వడదెబ్బ మరణాలు నమోదు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
లక్షణాలు ఇవి..
మొదట దాహంగా ఉంటుంది. పిల్లలైతే విపరీతంగా ఏడుస్తారు. పెద్దలు చికాకు స్వభావం కలిగి ఉంటారు. కళ్లు లోపలికి పోవడం, నోటిలో, నాలుకపై తేమ తగ్గడం, తడారిపోవడం, మూత్రం తగ్గడం, అది తీవ్రమైతే పిల్లలు షాక్‌లోకి వెళతారు. నాడి తక్కువగా కొట్టుకోవడం, మూర్చ, కలవరింతలు వస్తాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి చెమటపట్టడం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు దాటొచ్చు.


