గ్రేటర్‌కు దిక్కెవరు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌కు దిక్కెవరు

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

సిటీప్లానర్‌ లేక ఏడాదిన్నర..

నగర దశ దిశను చూపించే కీలకపై పట్టణ ప్రణాళిక విభాగానికి సిటీప్లానర్‌ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీ ఉంటుంది. అప్పట్లో పూర్తిస్థాయి సిటీప్లానర్‌ రాజకీయ కారణాలతో హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో డిప్యూటీ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా రెండు డీసీపీ, మూడు ఏసీపీ, టీపీఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అనుమతి లేని భవనాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతి తీసుకున్నా ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, జంక్షన్ల విస్తరణ అటకెక్కింది. వరంగల్‌ మహానగర పాలకసంస్థకు కొత్త కమిషనర్‌తోపాటు కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం ఉంది.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకవైపు పాలకవర్గం పదవి కాలం మరో 22 రోజుల్లో ముగియనుంది. మరోవైపు పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేక ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ కీలకవిభాగాల్లో ఇన్‌చార్జులు కొనసాగుతున్నారు. దీంతో పరిపాలన అదుపు తప్పింది. పాలకవర్గం గడువు ముగిస్తే హనుమకొండ కలెక్టర్‌ బల్దియా స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె కలెక్టర్‌గా, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా, కుడా వైస్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాల్‌ మారనుంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే పెద్ద నగరమైన వరంగల్‌ సాంస్కృతిక, వారసత్వ, కాకతీయుల రాజధానిగా ఘనకీర్తి చెందింది. భవిష్యత్‌ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ), ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, నగర శివారులో టైక్స్‌టైల్‌ పార్కు పనులు ఊపందుకున్నాయి. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోవడం లేదు.

సమస్యల సవాళ్లు..

మహా నగర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతుల్లేవు. ప్రతి సోమవారం గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో ప్రజలు వందల సంఖ్యలో వినతులు అందజేస్తున్నారు. ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాల్లో పౌరసేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసస్థాయిలో కూడా జవాబుదారీ తనం కరువైంది. నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. సిటిజన్‌ చార్టర్‌ ఉద్దేశమే లేదు. బాధ్యత లేని సిబ్బంది ఫిర్యాదులను ఉల్లంఘిస్తే జరిమానా విధించి బాధితులకు అందచేయాలి. ఈ నిబంధన బేఖాతారు చేస్తున్నారు. ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూద్దాం.. చేద్దామంటున్నారు. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వేసవికి సరిపడా నీళ్లున్నా ఇంజనీర్లు ఫిల్టర్‌బెడ్ల నిర్వహణపై అశ్రద్ధ చూపెడుతున్నారు. పైపులైన్ల లీకేజీలు నీరు వృథాగా కాల్వల పాలవుతోంది. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.వందల కోట్లు వెచ్చించినా ఇంకా మురికివాడలు, విలీన గ్రామాల్లో వాటర్‌ ట్యాంకర్లే శరణ్యమంగా మారాయి. విద్యుత్‌ లైట్లు వెలగక కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ క్రమం తప్పింది. 3వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో సుమారు 400 మంది పనులు చేయకుండానే అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లను మేనేజ్‌ చేసుకుంటూ జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో పైసలిస్తేనే పనులు ముందుకు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండున్నర నెలలుగా ఎస్‌ఈ పోస్టు ఖాళీ..

నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ఎస్‌ఈ సత్యనారాయణ రెండున్నర నెలల కిందట పదవి విరమణ చేశారు. పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌కు అదనంగా బల్దియా ఎస్‌ఈ బాధ్యతలు అప్పగించారు. రూ.వందల కోట్లతో నగరంలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన పెద్ద దిక్కు లేరు. మూడు ఈఈ పోస్టులు, నాలుగు డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు కట్టబెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పనులు చేయలేకుండా పోతున్నారు. అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

కీలకమైన కమిషనర్‌, ఎస్‌ఈ, సిటీప్లానర్‌ పోస్టులు ఖాళీ

ఫిర్యాదులు, ఫైళ్లు, అభివృద్ధిని పట్టించుకునే వారు కరువు

కార్యాలయాల చుట్టూ నగర ప్రజల ప్రదక్షిణ

మరికొద్ది రోజుల్లో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన

Advertisement
 
Advertisement
Advertisement