● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికా 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా చేపడుతున్న చర్యల పురోగతిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
కాశిబుగ్గ: వరంగల్‌లోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్‌ఆర్‌ఐ భవనంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు ఆవిష్కరించారు.
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి
పర్యటన
హన్మకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నేడు (బుధవారం) వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ ఓ సిటీలోని వీధి వ్యాపారులను సన్మానించి వారికి టీ స్టాళ్లు పంపిణీ చేయనున్నారు. 3 గంటలకు గ్రాండ్ గాయత్రి హోటల్‌లో మీడియా సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు 44వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం నుంచి నారీశక్తి వందన్ అథినియం కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.


