సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడిన వారు ఎంత ధరైనా కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఉన్నంత పోలీసు నిఘా ఇప్పుడు లేకపోవడం, ఒకవేళ దారితప్పి ఈ కేసుల్లో ఇరుక్కున్నా గరిష్టంగా ఆరు నెలల జైలు, లేదంటే రూ.లక్ష జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండూ అమలైనా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తక్కువ పెట్టుబడితో వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.
నిఘా కరువు.. తగ్గుతున్న కేసుల సంఖ్య
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2024 సంవత్సరంలో 342 కేసులు నమోదు చేసిన పోలీసులు.. 2025లో 463 కేసులతో నిఘా ఉధృతం చేశారు. 2026 మార్చి ముగిసే నాటికి కేవలం 21 కేసులు మాత్రమే నమోదవడం చూస్తే గుట్కా నిల్వలు, అక్రమ రవాణాపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలొస్తున్నాయి. రాజకీయంగా ఈ వ్యాపారానికి అండదండలు ఉండడంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని కొంత పోలీసులు చిన్నచిన్న పాన్‌షాప్‌లు, దుకాణాలపై దాడులు చేసి మమ అనిపిస్తున్నారు. ఇటీవల మిల్స్ కాలనీ, హనుమకొండ పోలీసు స్టేషన్ల పరిధిలో గుట్కా విక్రయదారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కీలకంగా ఉండే డీలర్లు, హోల్‌సేల్ షాప్ యజమానులపై చూసీచూడనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ఆగమాగం చేసే ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల కఠినంగా ఉండాలన్న డిమాండ్ వస్తోంది.
నిర్మానుష్య ప్రాంతాల్లో సరుకు నిల్వ
నిషేధిత పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు వరంగల్ కేంద్రంగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే పిన్నావారి వీధి, రామన్నపేట, ఎస్‌ఆర్‌ఆర్ తోట, నగర శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో సరుకును నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకొని పక్కా ప్రణాళికతో విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంబర్, పాన్‌బార్, విమల్, ఆర్‌ఆర్, రజినిగంథ్, మీరజ్, అనార్ వంటి గుట్కా నిల్వలను వరంగల్ పిన్నావారి స్ట్రీట్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యమనే చర్చ జరుగుతోంది.
వీరు ఫిక్స్ చేసిందే ఫైనల్ రేటు
వరంగల్ గుట్కా డాన్‌లు రేట్ ఫిక్స్ చేస్తే అదే ఫైనల్. పొగాకు ఉత్పత్తులకు ఎమ్మార్పీ రేటుకు రెండింతలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఎవరైనా వారి వద్ద సరుకు తీసుకోకుంటే వారే పోలీసులకు పట్టిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యాపారులు, డీలర్లు వారి వద్దనే సరుకు తీసుకుంటారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఉమ్మడి కరీంగనర్‌లోని పలు ప్రాంతాల్లో గుట్కా డాన్‌ల వ్యాపార సామ్రాజ్యం విస్తరించించినట్లు తెలుస్తోంది. కోల్‌బెల్ట్‌లో అధిక శాతం వ్యాపారం జరుగుతుండడంతో గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైన ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. పకడ్బందీగా దుకాణాలకు సరుకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.
వరంగల్ జిల్లా కేంద్రంగా జోరుగా దందా
నామమాత్రంగా దాడులతో పోలీసుల సరి
ఫలితంగా పల్లెల్లోకి పాకిన వ్యాపారం
ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ పకడ్బందీగా పొగాకు ఉత్పత్తుల సరఫరా
సంవత్సరం కేసులు అరైస్తెన సొత్తు
వారు స్వాధీనం
2024 342 365 రూ.కోటి 44 లక్షలు
2025 463 487 రూ.72 లక్షలు
2026 21 16 రూ.12 లక్షలు


