● మార్కెట్‌కు పోటెత్తుతున్న వాహనాలు
● ఆవరణలో స్థలం లేక గేటుకు తాళం
● అధికారులతో రైతుల వాగ్వాదం
నర్సంపేట: మక్క రైతుకు తిప్పలు తప్పడం లేదు. మార్కెట్‌లో మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్తామంటే వెళ్లలేని దుస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో చాలామంది రైతులు ఉన్నారు. జిల్లాలో 2025 –26వ సంవత్సరంలో 46వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేయగా, లక్షా 38వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లా పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కొంత ఉపశమనం లభించగా, జిల్లాలో మిగతా చోట్ల మక్క రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
కొనుగోళ్లలో ఆలస్యం
ఏనుగల్, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్లలో మక్కలు పేరుకుపోయాయి. మక్కలకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2400 ప్రకటించడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1600ల నుంచి రూ.1900ల వరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తుండడంతో మార్కెట్‌లోనే అమ్ముకోవడం కోసం రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు ఆలస్యం కావడం.. మక్కలు మార్కెట్‌కు భారీగా తరలిరావడంతో మార్కెట్‌కు మక్కలు తీసుకురావద్దని బహిరంగంగానే అధికారులు ప్రకటన చేస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో భారీగా పేరుకుపోయాయని, ఈ క మ్రంలో మార్కెట్‌కు మక్కలు తీసుకురావద్దని అధికారులు శనివారం పత్రికా పరంగా వెల్లడించారు. అయినప్పటికీ మక్కలను రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్ సిబ్బంది గేటుమూసి వేసి మక్కలకు నో ఎంట్రీ అనడంతో రవాణా చార్జీలు మీద పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ
జిల్లావ్యాప్తంగా మక్కలను తాజాగా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో రైతులను ప్రైవేట్ వ్యాపారులు నిలువు దోపడీ చేస్తున్నారు. క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,800 మాత్రమే వెచ్చిస్తుండడంతో ఒక్కో రైతు రూ.700 నుంచి రూ.900 వరకు నష్టపోతున్నాడు. ఎకరాకు పెట్టుబడి ఖర్చు సుమారుగా రూ.28వేల నుంచి రూ.40వేల పెట్టుబడి పెట్టామని, తక్కువ ధరకు అమ్ముకుంటే గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం మద్దతు ధరకు వెనువెంటనే కొనుగోలు చేసేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మక్క రైతుల ఆందోళన
నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ అధికారులు ఏర్పాటు చేసిన సెంటర్‌లో మక్కలు కొనుగోలు చేయాలని రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌లో భారీగా నిల్వఉన్న మక్కలను కొనుగోలు చేసే వరకు ఇతర మక్కలను తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ప్రకటన చేసినప్పటికీ గత రెండు రోజులుగా నర్సంపేట మార్కెట్‌కు పంట ఉత్పత్తులను రైతులు తీసుకువస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగి వాగ్వాదానికి దిగారు. మక్కల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు.


