● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట: పట్టణంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ స్థలానికి త్వరితగతిన హద్దులు ఏర్పాటు చేసి మ్యాపింగ్ చేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆదేశించారు. పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని సోమవారం సందర్శించి పరిశీలించారు. స్థలం ఎంత ఉందని అధికారులను అడుగగా, మూడు సర్వే నంబర్లలో ఐదెకరాలు ఉందని వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన ఈ భూమి పూజారుల ఆధీనంలో ఉందని, అందుకు బదులుగా వారికి గువ్వలబోడు వద్ద స్థలం కేటాయిస్తామని చెప్పారు. అత్యాధునిక వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్‌పర్సన్ షీబారాణి, మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్‌కుమార్, కౌన్సిలర్లు పాపారావు, కమిలీ, దేవేందర్, వాణి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూల్ల రవి, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పోశాల వెంకన్న, రామకృష్ణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


