నెక్కొండ: గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రిలో ఇన్ పేషంట్లు, అవుట్ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తూ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆరోపణలతో ఉపేందర్ ఆస్పత్రిని సీజ్ చేశామని నర్సంపేట డిఫ్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఉపేందర్ ఆస్పత్రిని వైద్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆస్పత్రి నిర్వహించడంపై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయిందని తెలిపారు. ఇటీవల లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేసినట్లు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో వెలుగులోకి రావడంతో ఐనవోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్‌కుమార్, నెక్కొండ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రహేలాతన్వీర్, డిఫ్యూటీ డెమో అనిల్‌కుమార్, ఎస్‌ఓ విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబు ల్ రమేష్, హోంగార్డ్ సురేందర్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


