వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ రెఫరీగా కాజీపేటలోని బాపూజీనగర్ కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అర్హత సాధించాడు. ఈ మేరకు ఆయనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరక్టర్ గుగులోత్ అశోక్‌కుమార్ సోమవారం శాలువాతో సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెల్‌బాల్ అసోసియేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించిన రెఫరీ పరీక్షలో ఇర్ఫాన్ ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ చైర్మన్ నార్మన్ ఐజాక్ మెయిల్ ద్వారా జారీ చేసినట్లు ఇర్ఫాన్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాస్కెట్‌బాల్ అంతర్జాతీయ రెఫరీగా సాధించిన మొదటి వ్యక్తి ఇర్ఫాన్ కావడం విశేషం. కార్యక్రమంలో బాస్కెల్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి రాజు, కార్యదర్శి డోలి సాంబయ్య, డీఎస్‌ఏ రెజ్లింగ్ కోచ్ రాజు ఉన్నారు.
హనుమకొండ డీఐఈఓ గోపాల్
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చునని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. సంబంధిత కళాశాలల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని, యాజమాన్యాలు కళాశాలల సమీకృత బోర్డుకు ఫీజులను ఆన్‌లైన్‌ద్వారా చెల్లించాల్సింటుందని వివరించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వతేదీ నుంచి నిర్వహిస్తారని తెలిపారు.
కేయూ క్యాంపస్: మహారాష్ట్రలోని ఎంజీఎం యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 18వరకు జరగనున్న సౌత్‌జోన్‌ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొంటుందని యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. జట్టులో ఎండీహబీబుద్దీన్, ఎన్.రాకేష్, పి.మోహన్‌లాల్, ఎండీ రియాజ్, ఎండీ జసీమ్‌పాషా, జె.సంజీవ్ ఉన్నారు. యూసీపీఈ కేయూ ఫిజికల్ డైరెక్టర్ ఎం.అన్వేష్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాకేంద్రంలోని ఫాతిమా హైస్కూల్‌లో టెన్త్ జవాబుపత్రాల మూల్యూంకనం కొనసాగుతోంది. మొదటి దశలోని సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా ప్రస్తుతం రెండో దశలో ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ జవాబుపత్రాలను దిద్దుతున్నారు. ఈనెల 17నుంచి మూడవ దశలో సోషల్ స్టడీస్ జవాబుపత్రాలు మూల్యాంకనం ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగనుంది.
హన్మకొండ కల్చరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మార్కశంకర్‌నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలోని డబ్బాలు హనుమాన్‌నగర్ ఫేస్–1 కాలనీలోని కాదంబరి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించే కవి సమ్మేళనంలో కవులు, సాహితీవేత్తలు పాల్గొనాలని కోరారు.
నేడు ఆశాభోంస్లే సంతాప సభ
హనుమకొండలోని శ్రీసాయిమీరా కళామందిరంలో వరల్డ్ పీస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే సంతాపసభ నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. సభకు కవులు, కళాకారులు, గాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తరలిరావాలని, ఆశాభోంస్లేకు నివాళులు అర్పించి ఆమె జ్ఞాపకాలను స్మరించుకోవాలని కోరారు.


