ప్రజలకు జవాబుదారీగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

Apr 14 2026 7:16 AM | Updated on Apr 14 2026 7:16 AM

వరంగల్‌ అర్బన్‌ : మహా నగర ప్రజలు చెబుతూ, రాతపూర్వకంగా అందజేసిన సమస్యలకు జవాబు దారీగా ఉండాలని బల్దియా అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో వింగ్‌ అధికారులతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఆక్రమణలు, అతిక్రమణలపై 40 వినతులు అధికంగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 20, రెవెన్యూ విభాగానికి 7, ప్రజారోగ్యం, శానిటేషన్‌కు 8, నీటి సరఫరాకు 5, హర్టికల్చర్‌కు 1 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ సిటీ ప్లా నర్‌ రవీందర్‌ వాడేకర్‌, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నా రాణి, ఎంహెచ్‌ఓ రాజేష్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డీఎఫ్‌ ఓ శంకర్‌ లింగం, వెటర్నరీ వైద్యులు డా.గోపాల్‌ రావు, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

కొన్ని ఫిర్యాదులు ఇలా..

● వరంగల్‌లోని 11–18–3/2 ఇంటినంబర్‌కు 2021లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ కనెక్షన్‌ ఇచ్చినా నీళ్లు రాలేదని, గతనెల మరోసారి నల్లా కనెక్షన్‌ ఇచ్చి సిబ్బంది రూ.6వేలు వసూలు చేసినట్లు రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.

● 48వ డివిజన్‌ సిద్ధివినాయక కాలనీ రోడ్డు 2లో రోడ్డు, డ్రెయినేజీ అధ్వానంగా ఉందని, నూతనంగా నిర్మించాలని గుజా సోమేశ్వర్‌రావు, ప్రణతి, విజయ్‌కుమార్‌లు కోరారు.

● చింతల్‌ 16–11–371/1ఇంటినంబర్‌లో నల్లా కనెక్షన్‌ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారని, తొలగించాలని మహ్మద్‌ రాజీయోద్దీన్‌ విజ్ఞప్తి చేశారు.

● శివనగర్‌ 24 ఫీట్ల రోడ్డు, డ్రెయినేజీపై అక్రమ నిర్మాణం చేపట్టి తప్పడు పత్రాలతో ఇంటినంబర్‌ తీసుకున్నారని, రద్దు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 14వ డివిజన్‌ సుందరయ్య నగర్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు వినతిపత్రం సమర్పించారు.

● ఫోర్టు రోడ్డులోని శ్రీరాంనగర్‌లో సీసీరోడ్డు, డ్రె యినేజీ, లైటింగ్‌ ఏర్పాటు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు విన్నవించారు.

● 37, 38వ డివిజన్లలో డ్రెయినేజీ నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● వరంగల్‌లోని 19–12–23/ఎ/3లో ఇంటికి 3 నల్లా కనెక్షన్లు, 1వ డివిజన్‌ 52–3–154 ఇంటికి రెండు బిల్లులు వస్తున్నాయని, రద్దు చేయాలని కృష్ణమూర్తి , ప్రసాద్‌లు వేర్వేరుగా కోరారు.

● పెద్దమ్మగడ్డ పీఈఎస్‌ జూనియన్‌ కాలేజీ వద్ద వరద, మురుగు నీరు స్తంభిస్తుందని, డ్రెయినేజీ నిర్మించాలని థానా ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

● కడిపికొండలో రోడ్డు ఆక్రమిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

● హనుమకొండ 9వ డివిజన్‌ కాకతీయ కాలనీలో డ్రెయినేజీ నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు వివరించారు.

● 1వ డివిజన్‌ ముచ్చర్ల నాగారంలో డ్రెయినేజీ ని ర్మించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదని ఎ.ప్రసాద్‌ వినతి అందజేశారు.

● బాలసముద్రం ఏకశిల పార్కు దగ్గర పెద్ద ఇనుప డబ్బాను ఏర్పాటు చేశారని, ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

బల్దియా అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌

గ్రేటర్‌ గ్రీవెన్స్‌కు 85 ఫిర్యాదులు

Advertisement
 
Advertisement
Advertisement