వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్‌లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డీ–అడిక్షన్ సెంటర్‌ను పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా సెంటర్‌లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపర్చాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


