● ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రాయితీలు
● రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ
● జిల్లాలో 1,855 ఎకరాల్లో పంటల సాగు
ఖానాపురం: కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలు సాగుచేసి ఆర్థికంగా నష్టపోతున్న రైతులను కూరగాయల సాగువైపు వెళ్లేందుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సాగు పద్ధతులు, సబ్సిడీపై అవగాహనతోపాటు శిక్షణ సైతం ఇస్తోంది. వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తింపు పొందిన వరంగల్‌లో రైతులు అనేక రకాల పంటలను సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1,855 ఎకరాల్లో ప్రస్తుతం వివిధ రకాల కూరగాయల పంటలు వేశారు. ప్రతీ మండలంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులు మండలాల్లోని రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. మార్కెట్‌లో ఎప్పుడు డిమాండ్ ఉండే కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
రాయితీలు ఇలా..
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందించడంతో పాటు సబ్సిడీలను అందజేస్తుంది. ఇందులో ప్రధానంగా కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600 పెట్టుబడి ఇస్తోంది. అలాగే, మల్చింగ్ పద్ధతి ద్వారా నేలలో తేమ నిల్వ, కలుపు నియంత్రణ, దిగుబడి పెరుగుదల సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఎకరాకు రూ.8 వేల వరకు సబ్సిడీ సైతం ఇస్తుంది. అధునాతన పద్ధతిలో సాగును పెంచడానికి (షేడ్ నెట్, నెట్ హౌస్) రూ.లక్ష వరకు సబ్సిడీలు సైతం అందిస్తుంది. ఉచితంగా టమాట, మిర్చి, బెండకాయ, తోటకూర, పాలకూర, వంకాయ, దోసకాయ, బీరకాయ, పొట్లకాయ, వృక్షవల్లీతో పాటు పలు రకాల విత్తనాలను రైతులకు అందజేస్తుంది.
డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహం..
నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. డ్రిప్ పద్ధతి కోసం 70 నుంచి 100 శాతం వరకు రైతులకు సబ్సిడీ అందించనున్నారు. డ్రిప్ ద్వారా మొక్కలకు అవసరమైనంత నీరు నేరుగా వేర్లకు అంది నీటి వృథా తగ్గుతుంది. ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించవచ్చు. డ్రిప్ విధానంతో దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత సైతం మెరుగవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మండలం సాగు విస్తీర్ణం
గీసుకొండ 650
సంగెం 235
ఖిలావరంగల్ 220
వరంగల్ 60
నెక్కొండ 100
చెన్నారావుపేట 100
దుగ్గొండి 150
ఖానాపురం 40
నర్సంపేట 50
నల్లబెల్లి 50
వర్ధన్నపేట 50
పర్వతగిరి 100
రాయపర్తి 50
మొత్తం 1,855


