నర్సంపేట : నర్సంపేట మార్కెట్‌లో మొక్కజొన్నల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యార్డుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన బస్తాలు సుమారు 50వేల వరకు నిల్వ ఉన్నట్లు, తగినంత స్థలం లేకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12 తర్వాత ప్రకటన వెలువడే వరకు రైతులు మార్కెట్‌కు మొక్కజొన్నల అమ్మకానికి తీసుకురావొద్దని సూచించారు.
19న ‘మోడల్’ పరీక్ష
గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌లో 6 నుంచి 10 వ తరగతి వరకు ప్రవేశాలు పొందగోరే విద్యార్థులకు ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. 6వ తరగతికి సంబంధించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మిగిలిన వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.
రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి
పర్వతగిరి : హైదరాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాలులో ఈనెల 18న జరిగే రాష్ట్ర స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశాన్ని జయప్రదం చేయాలని వరంగల్ జిల్లా అధ్యక్షుడు చల్ల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం ఓడపల్లి శ్యాంకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సాంబారావు, రాష్ట్ర కార్యదర్శి సోమారపు వీరస్వామి హాజరయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి, ప్రముఖ న్యాయవాది అనుముల రమేష్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరలి రావాలని కోరారు. వరంగల్ పట్టణ మీడియా ఇన్‌చార్జ్ కందకట్ల మోహన్, హనుమకొండ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మోగుసాల దేవేందర్‌రెడ్డి, దుప్పటి ప్రకాశ్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు అనపురం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో
యువకుడి మృతి
గీసుకొండ: మద్యం తాగిన మత్తులో కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతంలోని శాంతినగర్‌కు చెందిన ఎండీ ఆసిఫ్ (32) మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి గ్రీన్‌సిటీ రోడ్డు (100 ఫీట్ల రోడ్డు సమీపం)లోని ఖాళీ స్థలంలో కిందపడి అక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
షార్ట్‌సర్క్యూట్‌తో
మొక్కజొన్న దగ్ధం
దుగ్గొండి : ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన మండలంలోని రాజ్యతండా శివారు గోబ్రియా తండాలో శనివారం సాయంత్రం జరిగింది. తండాకు చెందిన అజ్మీరా రవికుమార్ తనకున్న ఎకరంన్నర భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంకులు తీసి చేనులోనే వేశాడు. సాయంత్రం ఇంటినుంచి పొలం వద్దకు రాగా విద్యుత్ తీగలు గాలికి ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. దీంతో చేనుకు నిప్పు అంటుకుంది. మంటలు తీవ్రమై పంటంతా కాలిబూడిద అయింది. తనకు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.


