● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ/రామన్నపేట/వరంగల్ చౌరస్తా: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నాణ్యమైన మందులు ఎంతో కీలకమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎవరైనా నకిలీ మందులు తయారు చేసినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యలో మందుల నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై శనివారం వరంగల్ కొత్తవాడలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ మందులపై టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


