గీసుకొండ: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్‌వాడీ టీచర్ల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్న సిబ్బందికి 4జీ సెల్ ఫోన్లను అందిస్తుండటంతో సమస్య తీరనుంది.
జిల్లాలో మూడు ప్రాజెక్టులు
జిల్లాలో వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో 32 మంది సూపర్‌వైజర్లు, ముగ్గురు బ్లాక్ కోఆర్డినేటర్లు విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 85 అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామకం ఇంకా చేపట్టలేదు. జిల్లా అధికార యంత్రాంగం తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ సెల్‌ఫోన్లను అందించాలని నిర్ణయించింది. సుమారు 874 సెల్‌ఫోన్లను అంగన్‌వాడీ టీచర్లకు అందించనున్నారు.
తీరనున్న సమస్యలు
2021లో అంగన్‌వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదారులకు పారదర్శకంగా పౌష్టిక ఆహారం అందించేందుకు ‘పోషణ్ ట్రాకర్ ’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత టెక్నాలజీ ఉన్న ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడం, డిస్‌ప్లేలు పగిలి పోవడంతో అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లను కొనుగోలు చేసి వాడుతున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం వారికి సెల్‌ఫోన్లను అందించాలని నిర్ణయించింది.
నెలకోసారి ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు
అంగన్‌వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14–18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతీ నెల ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు తీసుకుంటారు. దీని కోసం కొత్త 4జీ ఫోన్లు ఉపయోగపడుతాయి. అలాగే ప్రతీ రోజు యాప్‌లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
విధుల నిర్వహణకే..
అంగన్‌వాడీ టీచర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం 4జీ ఫోన్లను అందిస్తోంది. అయితే వారి వ్యక్తి గత అవసరాలకు ఫోన్‌ను వాడకుండా ఆ ఫోన్లలో ‘హానో’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారు. దీంతో కేవలం ప్రభుత్వం రూపొందించిన ప్రోగ్రాంల వివరాలను అప్‌లోడ్ చేసే విధంగా ఫోన్లు పని చేస్తాయని, అంతే కాని వ్యక్తిగత అవసరాలకు ఫోన్‌ను వాడటం కుదరదని అధికారులు తెలిపారు.
సేవలు మరింత వేగవంతం
పరకాల ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద
4జీ ఫోన్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మరింత వేగవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కొనాయమాకుల రైతువేదిక వద్ద గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 119 మంది అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లను అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. డిజిటల్ సదుపాయాలు ఫీల్డ్ స్థాయిలో డేటా నాణ్యతను పెంచడంతో పాటు సేవల పర్యవేక్షణను బలోపేతం చేయవచ్చన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి పుష్పలత, డీడబ్ల్యూఓ రాజమణి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, సీడీపీఓ డెబోరా తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ టీచర్లకు 4 జీ ఫోన్లు
ఇక ఆన్‌లైన్ సేవలు వేగవంతం
జిల్లాలో 874 ఫోన్ల పంపిణీకి సన్నాహాలు
గీసుకొండలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద


