ర్యాగింగ్‌.. ఫ్యూచర్‌ ప్రశ్నార్థకం! | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌.. ఫ్యూచర్‌ ప్రశ్నార్థకం!

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

సాక్షి, వరంగల్‌: కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)లో వైద్య విద్యార్థుల ర్యాగింగ్‌ వారి కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. రూ.లక్షలు ఖర్చు చేస్తూ డాక్టర్‌గా తమ బిడ్డలను చూడాలనుకుంటున్న తల్లిదండ్రుల కలలను చిదిమేస్తున్న వీరు క్షణికావేశం, సరదా కోసం ర్యాగింగ్‌ చేస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. ర్యాగింగ్‌ కేసులో పోలీసులు కేసులు నమోదు చేయగా ప్రైవేట్‌ ఉద్యోగవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలను చేజార్చుకునే పరిస్థితికి రావడం తల్లిదండ్రులకు ఆందోళనగా మారింది. కేఎంసీలోని గౌతమ పురుషుల హాస్టల్‌ టెర్రస్‌పై గత నెల 29వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 30వ తేదీ తెల్లవారు జామున 3:00 గంటల వరకు రెండో సంవత్సర విద్యార్థులను ‘నీల్‌ డౌన్‌’, ‘ఎయిర్‌ చైర్‌’ వంటి భంగిమల్లో ఉంచి థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు వేధించినట్లు తేలింది. ఈ ఘటనకు అసలైన ఏడుగురిని బాధ్యులను చేస్తూ ర్యాగింగ్‌ నియంత్రణ కమిటీ ఒక సెమిస్టర్‌తో పాటు ఆరు నెలల పాటు హాస్టల్‌ సౌకర్యాల నుంచి దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరికి మే నెలలోనే సెమిస్టర్‌ పరీక్షలుండడం, మరో నాలుగు నెలల్లోనే మళ్లీ పరీక్షలు ఉండడంతో దాదాపు ఏడాది పాటు వీరి చదువు కెరీర్‌కు ఇబ్బందిగా మారిందని వైద్య విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. కేఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.సంధ్య ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు నిందితులపై తెలంగాణ ర్యాగింగ్‌ నిరోధక చట్టం, 1997లోని సెక్షన్‌ 4(జీ), 4(జీజీజీ), భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్లు 189, 126(2), 127(2), 190 కింద కేసులు నమోదు చేశారు. అక్రమంగా గుమిగూడటం, అడ్డుకోవడం, నిర్బంధించడం వంటి అభియోగాలపై ప్రస్తుతం మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ రావు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement