‘అరైవ్‌–అలైవ్‌’తో ప్రతీ ప్రాణం కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

‘అరైవ్‌–అలైవ్‌’తో ప్రతీ ప్రాణం కాపాడాలి

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

మూడు జిల్లాల అధికారులతో సమీక్ష

హన్మకొండ అర్బన్‌ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్‌ అలైవ్‌’కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసి ప్రతీ ప్రాణం కాపాడే ప్రయత్నం చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సీపీ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల అధికారులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హసనన్‌పర్తి ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ జిల్లా, మునిసిపల్‌, గ్రామస్థాయిలో రోడ్‌ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ బ్లాక్‌ స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జనగామ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ నేషనల్‌ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు, అదనపు కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ, రవాణా, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement