రైతులకు ముందుగానే
గన్నీ సంచులు..
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 18 నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 154 కేంద్రాలు (ఐకేపీ 64, పీఏసీఎస్ 90) ఏర్పాటు చేసి 1.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులకు ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఆయన వెల్లడించారు.
1.24 లక్షల ఎకరాల్లో సాగు..
2.70 లక్షల టన్నుల దిగుబడి అంచనా
రబీలో జిల్లాలో 1,24,480 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 2.70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 1.66 లక్షల టన్నుల సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలోని 60 రైస్ మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నట్లు వివరించారు. ప్రతి రైస్‌మిల్లుకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.
సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ కోసం 41.53 లక్షల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 20.69 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి త్వరలో చేరనున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా 585 టార్పాలిన్లు, 180 తేమ కొలిచే యంత్రాలు, 196 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
ప్రభుత్వ పరిశీలనలో రైస్‌మిల్లర్ల సమస్యలు
సమావేశంలో రైస్‌మిల్లర్లు కొన్ని సమస్యలను ప్రస్తావించారని, అవి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని రైస్ మిల్లర్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఎం మహేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 18 నుంచి
విక్రయాలు ప్రారంభం
ఐకేపీ 64, పీఏసీఎస్ 90
సెంటర్ల ఏర్పాటు
1.66 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం
అధికారులతో అదనపు కలెక్టర్ ఎన్.రవి సమీక్ష
ఈసారి రైతులకు ముందుగా గన్నీ సంచులు ఇస్తామని, వారు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత అక్కడే సంచులు అందజేసి నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం తీసుకురావాలని, లేకపోతే తరుగు సమస్యలు ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రైతులు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి త్వరలో నంబర్ ప్రకటిస్తామని తెలిపారు.
ఖరీఫ్‌లో 1.35 లక్షల టన్నుల సేకరణ
ఖరీఫ్ సీజన్‌న్‌లో జిల్లాలో 154 కేంద్రాల ద్వారా 36,331 మంది రైతుల నుంచి 1.35 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఇందుకు రూ.3.24 కోట్లు చెల్లించగా, 26,173 మంది రైతులకు రూ.48.66 లక్షల బోనస్ అందజేసినట్లు పేర్కొన్నారు.


