ఐనవోలు: అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడిచేసి గాయపరిచిన సంఘటన మండలంలోని గర్మిళ్లపల్లి శివారులో జరిగింది. జఫర్‌గఢ్ ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన ఏటూరి స్వప్న– రాజు దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం క్రాస్‌వద్ద ఉన్న కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కాగా స్వప్న, రాజు గురువారం కూతురిని కలవడానికి ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి బయలుదేరారు. గర్మిళ్లపల్లి శివారు మీదుగా కేజీబీవీకి వెళ్తుండగా మార్గమధ్యలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్వప్న వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో రాజు తాను వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన స్వప్నను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్వప్న మేనల్లుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు రాజును శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రామారావు తెలిపారు. కానిస్టేబుళ్లు రాజు, రిషికేష్, హోం గార్డు పూర్ణ పాల్గొన్నారు.


