హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపండి | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపండి

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

నయీంనగర్‌: ప్రజల అభీష్టం మేరకు హనుమకొండ జిల్లాను వరంగల్‌ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో పౌర సంఘాలు, మేధావులు, నాయకులు నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్‌ మాదిరి అన్ని జిల్లాలతో కలిపి మూడు కోట్ల అరవై లక్షల మంది ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్‌ నగరాన్ని ముక్కలు చేసి, పార్కుల భూములు కబ్జా చేసి, వరంగల్‌ జైలు భూమిని తాకట్టు పెట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలో, వరంగల్‌ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తాత్సారం చేస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొత్త జిల్లాలు రాష్ట్రంలోని అనేక జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయని, హనుమకొండ జిల్లా దయనీయంగా చివరగా 33వ స్థానంలో ఉందని ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ చైర్మన్‌ కె.సుధాకర్‌ ప్రభుత్వ గణాంకాలతో వివరించారు. వరంగల్‌ మాజీ మేయర్‌ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇతర జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే 1400 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్‌ నగర ప్రజల ఆకాంక్షను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సీపీఎం నాయకుడు చుక్కయ్య మాట్లాడుతూ వరంగల్‌ మహా నగర అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. సదస్సులో నాయకులు వెంకటరాజం, సీనియర్‌ జర్నలిస్ట్‌ దాసరి కృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ వి.రవీందర్‌, డాక్టర్‌ విజయలక్ష్మి, లాయర్‌ చిల్లా రాజేంద్రప్రసాద్‌, జిలకర శ్రీనివాస్‌, రామమూర్తి, సాయిని నరేందర్‌, మల్లేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement