వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ నేడు ఉచిత ఆయుష్‌ వైద్యశిబిరం కోటను సందర్శించిన డీఎస్పీ మాధవీలత హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ ట్రయల్‌రన్‌ నేటికి వాయిదా విదేశాల్లో ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు రుద్రేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కల్యాణమండపం పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ప్రతీ చిన్న విషయానికి క్రెడిట్‌ కొట్టేయాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్‌రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, భైరి శ్రవణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ చౌరస్తా: హోమియోపతి పితామహుడు క్రిస్టియన్‌ ఫ్రెడ్రిచ్‌ సామ్యూల్‌ జయంతి సందర్భంగా నేడు(శుక్రవారం) వడ్డేపల్లిలోని ప్రణయ్‌ పార్క్‌ వద్ద ఉచిత ఆయుష్‌ వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయుష్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ మహేంద్రకుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఉచిత యోగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆర్థరైటిస్‌, గ్యాస్ట్రిక్‌, కిడ్నీ, చర్మ, బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు ఉచితంగా వైద్యసేవలందించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

ఖిలా వరంగల్‌: ఓరుగల్లు కోటను గురువారం డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగం డీఎస్పీ మాధవీలత సందర్శించారు. శిల్పకళాసంపదతో పాటు ఖుష్‌మహల్‌, ఏకశిలగుట్ట, రాతి, మట్టికోటను తిలకించారు. కాకతీయ విశిష్టతను గైడ్‌ రవియాదవ్‌ వివరించారు. అ నంతరం చారిత్రక కళాఖండాలు అద్భుత సంపదని కొనియాడారు. ఆమె వెంట మిల్స్‌కాలనీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురే్‌శ, సిబ్బంది ఉన్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట నుంచి పెద్దంపేట మధ్య గురువారం నిర్వహించాల్సిన హైస్పీడ్‌ కారిడార్‌ కవచ్‌ ట్రయల్‌రన్‌ను శుక్రవారం చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి రూట్‌లో కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్‌ ట్రయల్‌ రన్‌ను శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులపాటు అధికారికంగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి రెండు లోకోలను గురువారం రాత్రి కాజీపేట జంక్షన్‌కు తరలించారు. ఇక్కడి నుంచి ట్రయల్‌ రన్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ శిక్షణ ఉపాధి సంస్థ ప్లేస్‌మెంట్‌లో భాగంగా తెలంగాణ ఓవర్‌సిస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టాంకాం) ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అర్హులైన నిరుద్యోగులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్‌ మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement