హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దాదాపు పూర్తి స్థాయిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు బుధవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను సబ్‌స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్ల నిర్వహణను ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు చూసుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జె న్ కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,382 మంది అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, 3,457 మంది ఆర్టిజన్ ఉద్యోగులున్నారు. వీరిలో కొందరు మినహా అందరూ సమ్మెకు దిగారు. సర్కిల్, డివి జన్ కార్యాలయాల వద్ద సమ్మె నిర్వహించారు.
వర్కర్ల కొరత..
ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు విధులకు దూరంగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు వర్కర్ల కొరత నెలకొంది. ఈ తరుణంలో ఈదురుగాలు, ప్రకృతి విపత్తులు తలెత్తి విద్యుత్ లైన్లలో సమస్యలు తలెత్తితే అంధఃకారం తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల బాధ్యతలు నిర్వహించడానికి సరిపోతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏదైనా సమస్య ఏర్పడితే పని చేయడానికి అందుబాటులో ఎవరూ లేరు. ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలోనూ విద్యుత్ స్తంభాలు ఎక్కి చక్కదిద్దే పనులు ఆన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు చేసేవారు. ప్రస్తుతం వీరు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య జఠిలంగా మారనుంది.
మాట్లాడుతున్న టీఆర్‌పీఏయూ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు రమణారెడ్డి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన
అధికారులు
టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్
ఉద్యోగులు 3,457
అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు
1,382 మంది
సమ్మె కొనసాగితే ఇబ్బందులే..
ఈదులు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే అంధకారమే..
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ ఉద్యోగులకు ఒకే సర్వీస్‌రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్ల అర్హతను బట్టి రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ రావుల రమణారెడ్డి అన్నారు. నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రమణారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ యూనియన్ ఆర్టిజన్ల పోరాటానికి అండగా ఉంటుందన్నారు. టీఎస్‌ఈఈయూ–327 హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, టీఆర్‌పీఈయూ నాయకులు కడెం మహేశ్, వెంకటరమణ సంఘీభావం తెలిపారు.
ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయం ఎదుట..
నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ట్రాన్స్‌కో ఆర్టిజన్ ఉద్యోగులు హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయం వద్ద నిరసన తెలి పారు. టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి ఆర్టిజన్లకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో విభాగం రాష్ట్ర కన్వీనర్లు వెంకటేశ్, భరత్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రెటరీ సునీల్, జేఏసీ నాయకులు శ్రీనివాస్, మూర్తి, ప్రసాద్, ఆనంద్, రంగారావు పాల్గొన్నారు.
టీఆర్‌పీఈయూ టీజీ ఎన్పీడీసీఎల్
అధ్యక్షుడు రావుల రమణా రెడ్డి


