వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విభాగాల అకడమిక్ పరిశీలనలో భాగంగా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) డాక్టర్ బండారు మన్మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్ కలిసి ఎర్రబెల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా ప్రీ–ప్రైమరీ తరగతుల్లో అమలవుతున్న అకడమిక్ ప్రమాణాలు, బోధన విధానాలు, పిల్లల అభ్యసన స్థాయి, తరగతి గది వాతావరణం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించేలా ఆటల ద్వారా బోధన అమలవుతున్న తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న బోధన అభ్యాస సామగ్రి, ప్రీప్రైమరీ కిట్లు, ఫర్నిచర్, ఆట వస్తువులు నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


