హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 155 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శ్మశాన వాటికకు
స్థలం కేటాయించాలని వినతి
నగరంలోని 65వ డివిజన్ పరిధి చింతగట్టు గ్రామానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని సీనియర్ సిటిజన్‌న్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విద్యారణ్యపురి–గోపాలపురం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ద్వారా హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి లేఖ అందజేశారు.
వరంగల్ అర్బన్: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు ‘ఎర్లీ బర్డ్’ పద్ధతిలో అందిస్తున్న 5 శాతం రాయితీపై ప్రత్యేక దృ సారించాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. సోమవారం నగర ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లలో అధికారులు చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. ఎర్లీ బర్డ్ రాయితీ ప్రయోజనాలను ప్రతీ పన్నుదారుడికి చేరవేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో సుమారు రూ.80 కోట్ల నల్లా పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వసూళ్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్) పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్‌ను కూడా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు.


