జల్సా రాజాలు | - | Sakshi
Sakshi News home page

జల్సా రాజాలు

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

జల్సా రాజాలు పిల్లలపై దృష్టిపెట్టాలి..

కాజీపేట: యువత ప్రస్తుతం రెండు పదుల వయస్సు దాటకుండానే జల్సారాయుళ్లవుతున్నారు. అమ్మాయిల మనస్సు గెలుచుకోవాలనే ఆరాటంతో విలువైన కానుకలు ఇచ్చేందుకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చులకు అలవాటు పడుతున్నారు. డబ్బు దొరకని సమయంలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లకు సైతం వెనుకాడడం లేదు.

వరంగల్‌ మహా నగరంలో అప్పుడప్పుడు ఎక్కడో ఓ చోట చైన్‌స్నాచింగ్‌ జరుగుతునే ఉంది. ఇటీవల ట్రైసిటీలో దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు అధిక సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సగానికి పైగా యువకులే ఉండడం గమనార్హం. విచారణలో వారు ప్రేమికురాలి కోసమే చోరీలకు పాల్పడుతున్నట్లుగా చెబుతుండడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.

ప్రవర్తనలో మార్పులు..

పదో తరగతి పూర్తయ్యి కళాశాలలో అడుగు పెట్టిన విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వస్తోంది. కొత్త స్నేహితులు పరిచయం కావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిన ఖర్చులు కొన్ని అయితే తెలియకుండా ఇతరత్రా ఖర్చులు మరికొన్ని. ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌ చదువుతున్న యువకులు ఇప్పుడు తోటి స్నేహితుల కంటే అమ్మాయిలతో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

చైన్‌ స్నాచింగ్‌లకు రెక్కీలు..

యువకులు బైక్‌లపై స్నేహితులతో తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. రెండు, మూడు సార్లు రెక్కీ నిర్వహించి, ఆభరణాలు ధరించి ఉన్న మహిళలను టార్గెట్‌ చేస్తున్నారు. వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయిస్తున్నారు. దొంగల్లో యువకులే ఎక్కువ మంది నిందితులుగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాజీపేట పట్టణంలో తొమ్మిది ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన యువకుడు జల్సాలకు అలవాటు పడే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం విశేషం. ఇటీవల సీసీఎస్‌ పోలీసులకు చిక్కిన యువకులు ప్రేమ పాఠాల్లో మునిగి తేలుతున్నట్లుగా విచారణలో అంగీకరించడం గమనార్హం.

కళాశాలకు వెళ్తున్న తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వెంటనే వారిని సున్నితంగా మందలించాలి. అదే పనిగా డబ్బులు అడగడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు చేస్తున్నారంటే వారు గాడి తప్పినట్లేనని గుర్తించాలి.

– పింగిళి ప్రశాంత్‌ రెడ్డి, ఏసీపీ, కాజీపేట

మితిమీరుతున్న యువకుల ఖర్చులు

నగదు కోసం చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు

Advertisement
 
Advertisement
Advertisement