‘ఉమానాగ్‌ పాలిమర్స్‌’పై టాస్క్‌ఫోర్స్‌ కొరడా | - | Sakshi
Sakshi News home page

‘ఉమానాగ్‌ పాలిమర్స్‌’పై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

Apr 2 2026 7:11 AM | Updated on Apr 2 2026 7:11 AM

‘ఉమానాగ్‌ పాలిమర్స్‌’పై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ నగర శివారు ఏనుమాముల మార్కెట్‌ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ’ఉమానాగ్‌ పాలిమర్స్‌’ కంపెనీపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 12 లక్షల రూపాయల విలువ గల నిషేధిత ప్లాస్టిక్‌ గ్లాసుల ఉత్పత్తులతో పాటు ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ జి. బాబులాల్‌ తన సిబ్బందితో కలిసి తోట ప్రసాద్‌ నడుపుతున్న ’ఉమానాగ్‌ పాలిమర్స్‌’ తయారీ, డిస్టిబ్య్రూషన్‌ కంపెనీ పై దాడి చేశారు.తనిఖీల్లో భాగంగా పర్యావరణానికి అత్యంత హానికరమైన, ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్‌ కలిగిన ప్లాస్టిక్‌ గ్లాసులను భారీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.12 లక్షల విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. యజమాని తోట ప్రసాద్‌ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం అధికారులు రూ.50వేల జరిమానా విధించడంతోపాటు, యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.ఉప్పలయ్య, ఏఎస్‌ఐ కె.సుధాకర్‌, కానిస్టేబుళ్లు మహమ్మద్‌ గౌస్‌ పాషా, అంజయ్య, శ్యాం సుందర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు భాస్కర్‌, గోల్కొండ శ్రీను, జె.భీమయ్యలు తదితరులు పాల్గొన్నారు.

గుట్టుగా తయారీ..

నగరంలో బయటకు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్‌ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్దసంఖ్యలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారుల తనిఖీలకు వస్తున్నారనే సమాచారం రావడంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడినుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. భారీ జరిమానాలు, యంత్రాల స్వాధీనం, లైసెన్స్‌ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్‌ పడే అవకాశం ఉందంటున్నారు.

రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్‌ గ్లాసులు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement