ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్లు బీవీ నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లాలి
దుగ్గొండి: అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లాలని 108 జిల్లా మేనేజర్ గుర్రపు భరత్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో 108, 102 వాహనాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, గత నెలలో 110 మంది రోగులను సకాలంలో ఆస్పత్రిలో చేర్చిన సిబ్బందిని అభినందించారు. వడదెబ్బ సోకిన వారి కోసం అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, గర్భిణులకు 102 సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది ఈఎంటీ కోరికల నర్సింగరావు, పైలట్ కోతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గణిత పరీక్షకు 99.91 శాతం మంది హాజరు
కాళోజీ సెంటర్: జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి గణితశాస్త్రం పరీక్షకు 99.91 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మొత్తం 9,492 మంది విద్యార్థులకు 9,483 మంది పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు. 94 మంది ప్రైవేట్ అభ్యర్థులకు 90 మంది హాజరయ్యారని తెలిపారు.


