ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు, జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైనట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. జిల్లా కేంద్రంలో 8, పరకాలలో 2, బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి తెలిపారు. మొత్తం 474 పెండింగ్ కేసుల్లో సివిల్ కేసులు 48, యమ్ వీఓపీ కేసులు 41, (రూ.2,54,60,000)ల క్రిమినల్ కేసులు 426, బ్యాంక్ పీఎల్‌సీ కేసులు 29, సైబర్ క్రైమ్ కేసులు 29, సమ్మర్ ట్రయల్ కేసులు 8,282 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల న్యాయమూర్తుల నారాయణబాబు, ప్రేమలత, క్షమాదేశ్ పాండే, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, రామలింగం, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
స్నేహపూర్వక రాజీ వేదిక లోక్ అదాలత్ :
పరకాల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్
పరకాల: లోక్ అదాలత్ అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల్లో ఒకటని.. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న లేదా వ్యాజ్యానికి ముందు దశలో ఉన్న వివాదాలతో పాటు కేసులను స్నేహపూర్వకంగా పరిష్కారంతో రాజీచేసుకునే ఒక వేదిక ఉంటుందని పరకాల మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, పరకాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జి.సాయి శరత్ అన్నారు. పరకాల కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. రెండు బెంచ్‌ల ద్వారా జూనియర్ సివిల్ జడ్జి జి.సాయి శరత్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బొడ్డు శ్రీవల్లి శైలజ సివిల్, క్రిమినల్, బ్యాంక్ కేసులను పరిష్కరించారు. మొత్తం 437 కేసులను పరిష్కరించగా.. వాటిలో 3 సివిల్ కేసులు, 425 క్రిమినల్ కేసులతో పాటు 9 బ్యాంకు కేసులను పరిష్కరించారు. నగదు రూపంలో రూ.12,32,370 సేకరించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, ఎ.రవికుమార్, పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల భద్రయ్య, ఏపీపీ రుధిర, ఏజీపీ మేరుగు శ్రీనివాస్, పరకాల కోర్టు పరిధి పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.


