భూసేకరణ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వేగవంతం చేయండి

Mar 29 2026 6:45 AM | Updated on Mar 29 2026 6:45 AM

భూసేకరణ వేగవంతం చేయండి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, భూభారతి, మీ సేవ పెండింగ్‌ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో చర్చించారు. వచ్చే శనివారం నాటికి పురోగతి నివేదిక సమర్పించాలని, సాగునీటి కాల్వల కోసం పెగ్‌ మార్కింగ్‌ పనులను సోమవారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఆర్‌ఓఆర్‌, సీనియర్‌ సిటిజన్‌ కేసులను వారానికోసారి సమీక్షించి పరిష్కరించాలని, భూభారతి, సాదా బైనామా ఫైళ్లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మీ సేవ దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు.

జనగణన పటిష్టంగా నిర్వహించాలి

మే నెలలో ప్రారంభం కానున్న జనగణనను కచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి తెలిపారు. కలెక్టరేట్‌లో ఫీల్డ్‌ ట్రైనర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ, ట్రైనర్లకు జనగణన విధానాలు, డేటా సేకరణలో కచ్చితత్వంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ రవి, డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, సిటీ ప్లానర్‌ రవీంద్ర రాడేకర్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ సతీశ్‌, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగులు నిర్భయంగా

విధులు నిర్వర్తించాలి: వరంగల్‌ కలెక్టర్‌

న్యూశాయంపేట: మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోష్‌ యాక్ట్‌–2013పై కలెక్టరేట్‌లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పనిస్థలాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి కార్యాలయ బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన పోష్‌ చట్టం పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రతినిధి సుధాకర్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పోష్‌ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, డీఎల్‌ఎస్‌ఏ అడ్వకేట్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ ఫైళ్లు పరిష్కరించాలి..

పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్లు, ఇతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్ల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement