రూ.1,040.58 కోట్ల బడ్జెట్‌కు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదం
వరంగల్ అర్బన్: ఊరించే అంకెలు.. ఊహాజనిత పద్దులు.. వాస్తవాలకు పొంతన లేని లెక్కలు.. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి బడ్జెట్ అంచనాలను రూపకల్పన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్నుల రివైజ్డ్ పేరుతో కొంత మేరకు రాబడి పెంచుకునే విధంగా స్వల్పమార్పులు చేర్పులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మినహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. 2026–27 చివరి బడ్జెట్‌ను జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రూ.1,040.58 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. తొలుత మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. నగరాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పోడియం వద్ద బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు..
నగరాభివృద్ధి కోసం యూజీడీ, స్మార్ట్‌సిటీ, అమృత్ స్కీంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు పొడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. అకౌంటెంట్ శివలింగం బడ్జెట్ చదువుతుండగా పోడియం ఎదుట సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. నిబంధనలు పాటించాలని హనుమకొండ కలెక్టర్, ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ విన్నవించారు. చివరికి మేయర్ కేంద్ర ప్రభుత్వం, మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో శాంతించారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, మెప్పు కోసం అంకెలగారడి చేశారని కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ అన్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది.
మౌలిక వసతులకు నిధుల కోత
నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపించారు. కీలకమైన రంగాలకు కేటాయింపులను విస్మరించారు. పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానవాటికలు, వెజ్, నాన్ మార్కెట్లు తదితర సమస్యల పరిష్కారానికి గత ఏడాది రూ.10.40 కోట్లు కేటాయించారు. కానీ, ఈ ఏడాది రూ.2.70 కోట్లతో సరిపెట్టడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు.
సొంత రెవెన్యూ : రూ.349.18
స్టాంపు డ్యూటీ రూ.40
అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం రూ.10.10
శానిటేషన్ ద్వారా రూ.23.56
టౌన్ ప్లానింగ్ రూ.126.50
ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి రూ.36.27
ఖర్చులు ఇలా.. (రూ.కోట్లలో)
జీతాలు, ఈఎఫ్‌పీ, ఈఎస్‌ఐ, వ్యయాలు రూ.100
శానిటేషన్ వ్యయం రూ.40.75
విద్యుత్ చార్జీలు రూ.29,05
రుణాల చెల్లింపులు రూ.20 లక్షలు
గ్రీన్‌బడ్జెట్ రూ.34.91
ఇంజినీరింగ్ రూ.36,15
పరిపాలన వ్యయం రూ.30.41
టౌన్ ప్లానింగ్ వ్యయం రూ.1.40
డీజేఆర్‌ఎఫ్‌కు రూ.1.50
విలీన గ్రామాలు, మురికివాడలకు రూ.25.43
మౌలిక వసతులకు రూ.2.70
66 డివిజన్లకు మిగులు నిధులు రూ.47.41
సొంత ఆదాయంలో మిగులు బడ్జెట్ రూ.75 లక్షలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బడ్జెట్ రూ.685.20
నాన్‌ప్లాన్ గ్రాంట్ : రూ.127
ప్రకృతి విపత్తులు రూ.2
యూఐడీఎఫ్ వసతుల కల్పన రూ.75
15, 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.50
ప్లాన్‌గ్రాంట్స్ రూ.43
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.7
స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నిధులు రూ.8
వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, అమృత్ నిధులు రూ.10
ఇతరములు రూ.515
ఎంపీ నిధులు రూ.50 లక్షలు
మెప్మా నిధులు రూ.1.20
అత్యవసర ప్రత్యేకాభివృద్ధి నిధులు రూ.503
రెవెన్యూ గ్రాంట్ రూ.2.50
ఎన్నికల నిధులు రూ.6.50
జనాభా లెక్కలు రూ.50 లక్షలు
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2
డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.6.20
బడ్జెట్ స్వరూపం ఇలా.. (రూ.కోట్లలో)
సొంత ఆదాయం రూ.349.18 కోట్లు
ప్రభుత్వాల నుంచి అంచనా
రూ.685.20 కోట్లు
మేయర్ గుండు సుధారాణి
అధ్యక్షతన చివరి బడ్జెట్ సమావేశం


