● ఉపాధి కూలీలకు అందని డబ్బులు
● రెండు నెలలుగా ఎదురుచూపులు
● జిల్లాలో రూ.5.13 కోట్లకు పైగా
బకాయిలు
నల్లబెల్లి: వలసలు నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి వందరోజుల పనిదినాలు కల్పిస్తుంది. చేసిన పని ఆధారంగా గరిష్టంగా ఒక్కొక్కరికి రోజుకు రూ.307 చొప్పున చెల్లిస్తున్నారు. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. రానురాను పథకంలో మార్పులు చేయడం.. ఇందులో నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. పనులు చేసినా పస్తులుండే పరిస్థితి వచ్చిందని కూలీలు వాపోతున్నారు. రెండు నెలలుగా కూలీ డబ్బులు అందకపోవడంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదని అంటున్నారు.
నిలిచిన వేతనాలు
ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలి. కానీ జనవరి 17 నుంచి ఇప్పటి వరకు కూలీలకు వేతనాలు అందలేదు. జిల్లాలో 11 మండలాల్లో 24,904 కుటుంబాలు కూలీలు పనులు చేస్తున్నారు. వీరికి 1,88,000 పని దినాలకు సంబంధించిన సుమారు రూ.5.13 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కూలీలు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఈసం యాకమ్మ. గత ఫిబ్రవరి, మార్చి నెలలో ఐదు వారాల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లింది. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కుటుంబం గడవటం ఇబ్బందిగా మారింది. ఈ సమస్య యాకమ్మ ఒక్కరిదే కాదు.. జిల్లావ్యాప్తంగా ఉపాధి పని చేస్తున్న కూలీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
●
వేతనాలు చెల్లించాలి
ఉపాధి హామీ పనులకు సంబంధించిన కూలీలకు వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో చాలా కష్టమవుతోంది. కూలీ డబ్బులు ఎ ప్పుడు వస్తాయని సిబ్బందిని అడిగితే ఎవరు సమాధానం ఇవ్వడంలేదు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి.
– కనుకం సాల్మొన్, ఉపాధి కూలీ, నల్లబెల్లి
చర్యలు తీసుకుంటాం..
ఉపాధి హామీ కూలీలకు వేతనాలు నిలిచిపోయిన మాట వాస్తవమే. కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. త్వరలోనే కూలీలందరికీ వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – రాంరెడ్డి, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ
మండలం పని చేసిన పని దినాలు
కుటుంబాలు
చెన్నారావుపేట 2,515 16,647
దుగ్గొండి 2,566 20,049
గీసుకొండ 1,671 15,169
ఖానాపురం 1,926 16,105
నల్లబెల్లి 2,551 22,739
నర్సంపేట 1,643 13,191
నెక్కొండ 1,237 10,009
పర్వతగిరి 2,907 23,227
రాయపర్తి 2,340 18,164
సంగెం 3,945 34,980
వర్ధన్నపేట 1,655 14,725
మొత్తం 24,906 2,05,005


