బాధ్యతగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Mar 23 2026 10:01 AM | Updated on Mar 23 2026 10:01 AM

కలెక్టర్‌ సత్యశారద

వాగ్దేవిలో జనగణన శిక్షణ ప్రారంభం

ఖిలా వరంగల్‌: జనగణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాల అడిటోరియంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జనగణన 2027 సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. చార్జ్‌ సెన్సెస్‌ క్లర్క్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు జనగణన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహనతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూప కల్పనలో ఇవి కీలకమన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా సెన్సెస్‌ అధికారి (డీఆర్‌ఓ) విజయలక్ష్మీ, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, ఆర్డీఓ సుమ, తహసీల్ధార్‌ ఇక్బాల్‌, అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

నీటిని వృథా చేయొద్దు

వర్ధన్నపేట: ప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జల సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గులు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ విధానాలు, నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నీరు జీవనానికి మూలాధారమన్నారు. భవిష్యత్‌ తరాల కోసం దాన్ని కాపాడడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెపొందించుకునేలా అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి విధానాన్ని డెమో ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కౌడగాని సునితరాజేష్‌ఖన్నా, మిషన్‌ భగీరథ ఈఈ సునీత, తహసీల్దార్‌ విజయసాగర్‌, ఎంపీడీఓ వెంకటరమణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement