హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి మల్లెపూలతో పు ష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు మల్ల్లెకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం, భవానీ దంపతులు పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
నయీంనగర్: భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం మాడవీధుల నిర్మాణానికి తమ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించిన వారికి శనివారం ఇళ్ల పట్టాలు అందించారు. 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ‘కుడా’ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్‌పాయ్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు అజిత్‌రెడ్డి, భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ. రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, విష్ణుసూక్త మూలమంత్రయుక్తంగా నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవిగ్రహాన్ని జానకీ వల్లభుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. యాగశాలలో మహా సుదర్శనహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వెలమ సంఘం జిల్లా నా యకులు గుజ్జా సంపత్‌రావు, హైకోర్టు రిజి స్ట్రార్ ఓం శ్రీవిద్యాభారతి, వేదపండితులు గంగు మణికంఠ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


