సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్‌ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషాయా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్‌టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్‌తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటిస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.
లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
గోల్డెన్ అవర్ చికిత్సలో నాణ్యత పెంచే దిశగా అడుగులు
ఇప్పటికే ఈఎండీతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు
కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ
రోజుకు 200 వరకు ట్రామా కేసులు..
ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి.
క్షతగాత్రులకు సత్వర సేవలు..
ఇప్పటికే రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతున్నాయి. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎం ఆస్పత్రికి చోటుకల్పించడం ద్వారా ఇంకొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
– డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి,
ఎంజీఎం సూపరింటెండెంట్


