బీఫారం లభించేనా.. ఉత్కంఠ వీడేనా?
● ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు
● ముగిసిన స్క్రూట్నీ ప్రక్రియ
నర్సంపేట: మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆశించి నామినేషన్ వేసిన అభ్యర్థులు తాము అనుకున్న పార్టీ నుండి బీఫారం లభిస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని భావించిన ఆశావహులు నామినేషన్లు వేయగా శనివారం స్క్రూట్నీ ప్రకియ జరిగింది. నర్సంపేటలో 291 నామినేషన్లు, వర్ధన్నపేటలో 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి నామినేషన్ వేసిన వ్యక్తులు ఆ పార్టీ నుంచి బీఫారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో పోటీ చేసే వారి జాబితాను తయారుచేసినప్పటికీ మరికొన్ని వార్డుల్లో జరగలేదు. దీంతో ఒక్కో వార్డులో ఎక్కువగా మంది నామినేషన్లు వేశారు. కాగా, గెలుపు గుర్రాలను ఇప్పటికే గుర్తించిన నియోజకవర్గ పెద్దలు.. మిగతా వారిని బుజ్జగించి విత్‌డ్రా చేసుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంత మంది తాము కొనసాగిన పార్టీ నుంచి బీఫారం లభించకుంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.
చేజారకుండా జాగ్రత్తలు
ఆశావాహులను బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తూనే టికెట్ దక్కని వారు పార్టీని విడిచి పెట్టకుండా ఉండేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడిక్కడ వారిని ఒప్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఉండడంతో, ఆలోపు టికెట్ లభించని వారందరితో మాట్లాడి నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద ప్రధాన సమస్యగా మారనుంది. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం జరిగిన స్ట్రూట్నీలో ఏ ఒక్క నామినేషనూ తిరస్కరణ కాకపోవడంతో గమనార్హం.
బీఫారం లభించేనా.. ఉత్కంఠ వీడేనా?


