సాస్కీతో వెలుగులు
సాక్షి, వరంగల్:
కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న సాస్కీ (స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) ప్రాజెక్టుతో వరంగల్ మరింత వెలుగులీననుంది. ఇప్పటికే 2016లో స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికై రహదారుల అభివృద్ధి, వివిధ చెరువు బండ్‌ల పనులు, నాలా విస్తరణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు రూ.100 కోట్లతో చేపట్టిన ఈ నగరానికి ఇప్పుడూ సాస్కి (స్కీమ్ ఫర్ స్పెషల్ అ సిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) రూపంలో మరోసారి అదృష్టం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తున్న ఈ స్కీమ్ కింద సుమారు రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులతో పాటు వివిధ పనుల ప్రతిపాదనలు ‘కుడా’ నుంచి కేంద్ర ప్రభు త్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు గతేడాది డిసెంబర్ 24న వెళ్లాయి. డిసెంబర్ 31న కూడా ఈ సాస్కీ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ అడిషనల్ సెక్రటరీ సారాతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనేపథ్యంలో సాస్కీ నిధులు వరంగల్‌కు వస్తాయని అధికారులు అంటున్నారు. అవి రాగానే.. ఈ ప్రాజెక్టులను దాదాపు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉంది.
పురాతన ఆలయాలకు మరిన్ని సౌకర్యాలు..
హిస్టోరికల్ కోర్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగం కింద పురాతన ఆలయాలైన వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని ప్రతిపాదించారు. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న వసతులకు అదనంగా ఆలయాలు ముస్తాబు చేయనున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చేయడంతో పాటు వచ్చే భక్తులకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త లేకుండా చేస్తారు. లైటింగ్ ఉండేలా చూడనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు ఉండేలా ఈ ఆలయాలను అభివృద్ధి చేయనున్నారు.
నీరు పీల్చుకునే పార్కు
వరంగల్ నగరంలో వరదను నియంత్రించడంతో పాటు భూగర్భ నీటి మట్టం పెంచే దిశగా ఖిలావరంగల్‌లోని మోట్‌ను స్పాంజ్ పార్కుగా అభివృద్ధి చేయనున్నారు. రాతిగోడ వెంట ఉన్న కందకాల్లో ఉండే వరద నీటిని పీల్చేసి భూమి లోపలికి పంపించేలా స్పాంజ్ పార్కు నిర్మాణం చేపడతామని ప్రతిపాదించారు. ఇందులో నిర్మించే కుంట 340 చదరపు మీటర్ల నుంచి ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆయా కందకాల్లో వరద ఎక్కువైతే ఆ నీటిని పార్కుకు చేరేలా పైపులు అమర్చుతూ పార్కులోని కుంటకు వచ్చేలా చూడనున్నారు. వీటిలో స్థానికులకు ఆహ్లాదం కలిగించేలా మొక్కలు పెంచనున్నారు. అలాగే వరంగల్‌లోని కీర్తినగర్, హనుమకొండలోని మడికొండలో నైబర్ హుడ్ డెవలప్‌మెంట్ కింద ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలు తదితరాలను అభివృద్ధి చేస్తారు.
భద్రకాళి, వెయ్యిస్తంభాల
ఆలయాల్లో మరిన్ని వసతులు
ఖిలా వరంగల్‌లో స్పాంజ్ పార్కు
అభివృద్ధితో జలమట్టం పెంపు
కీర్తినగర్, మడికొండలో నైబర్‌హుడ్
డెవలప్‌మెంట్ పనులు
పచ్చదనం, అడవిని తలపించేలా
ఫోర్ట్ పరిసరాలు
ల్యాండ్ పూలింగ్‌తో నగర శివార్లలో
అభివృద్ధి
కేంద్రానికి పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు
పచ్చదనానికి కేరాఫ్ కోట
అర్బన్ ఫారెస్ట్రీ అండ్ గ్రీనరీ అంశం కింద ఫోర్ట్ వరంగల్ ప్రాంతమంతా చెట్లు, మొక్కలతో పచ్చదనం ఉట్టిపడేలా చేయనున్నారు. వీటికి అనుగుణంగా పాత్ వేలు కూడా నిర్మించనున్నారు. పర్యాటక ప్రాంతమైన ఖిలావరంగల్‌లో ఈ పచ్చదనం అభివృద్ధి మరింత మంది పర్యాటకులు కూడా పెరిగేందుకు అవకాశం ఉండనుంది. అలాగే బావులు, ట్యాంకులను అభివృద్ధి చేయాలంటూ వివిధ ప్రతిపాదనలను ‘సాస్కి’ పథకానికి పంపారు.
అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్
ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి కోసం టౌన్ ప్లానింగ్ స్కీంను మరింత సమర్థంగా అమలు చేసేలా ఈ సాస్కిలో ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ అభివృద్ధి ద్వారా భూమి ఇచ్చే వారితో పాటు ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా చూడనున్నారు. వీటివల్ల ఆయా ప్రాంతాల భూముల ధరలు పెరగడంతో పాటు అక్కడా మౌలిక వసతుల అభివృద్ధికి ఆస్కారం ఉండనుంది. ముఖ్యమైన పరిశ్రమలు, రహదారులు వచ్చే అవకాశం ఉండనుంది.
సాస్కీతో వెలుగులు
సాస్కీతో వెలుగులు
సాస్కీతో వెలుగులు
సాస్కీతో వెలుగులు
సాస్కీతో వెలుగులు


