లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్‌లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్‌లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్‌ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్‌ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో 8 బెంచ్‌లు..
లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల
ప్రధాన న్యాయమూర్తులు
నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు


