వైద్యులకు రక్షణ కల్పించాలి
నర్సంపేట రూరల్: రాత్రి వేళ విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి.బాలాజీ అన్నారు. ఈ మేరకు గురువారం నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం రాత్రి 10.30 గంటలకు పర్శనాయక్‌తండాకు చెందిన మహిళ కాలు నరాలకు సంబంధించిన వ్యాధితో వచ్చిందని తెలిపారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయ్‌పాల్ ఆమెను పరిశీలించి అడ్మిట్ చేసుకుని ప్రాథమిక వైద్యం అందించారని పేర్కొన్నారు. టెక్నీషియన్లు రాత్రివేళ అందుబాటులో లేకపోవడంతో సీటి స్కాన్ చేసేందుకు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేసినట్లు వివరించారు. ఆమె వెంట వచ్చిన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యూటీ డాక్టర్‌ను దుర్భాషలాడి, ఆస్పత్రి ప్రధాన ద్వారం అద్దాలను పగులగొట్టి దాడికి యత్నించారన్నారు. దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. దాడికి యత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రొఫెసర్లు డాక్టర్ పరశురాం, డాక్టర్ గిరిధర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బాలరాజు, ఆర్‌ఎంఓ నవీన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


