మరోసారి టీచర్ల సర్దుబాటు
విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా జారీచేసిన ఉత్తర్వులతో మరోసారి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యార్థులు తక్కువ ఉన్న చోట టీచర్లు ఎక్కువ మంది, విద్యార్థులు ఎక్కువమంది ఉన్న చోట టీచర్లు తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు చేయాలనేది అప్పట్లోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అందుకు మార్గదర్శకాలను విడుదల చేశారు. తొలుత టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియ జరిగిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ జరగడంతో మళ్లీ టీచర్ల సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అవసరం మేరకు అంటూ ఒక మండలం నుంచి మరో మండలానికి కూడా సర్దుబాటు చేశారు. పలుచోట్ల తమకు అనుకూలంగా ఉండే పాఠశాలలకు సర్దుబాటు చేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. సర్దుబాటు జరిగాక కూడా ఇంకా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గుర్తించినట్లు సమాచారం
టీచర్ల అవసరం ఉన్న పాఠశాలలు కూడా..
ఏయే జిల్లాల్లో ఎన్ని పాఠశాలల్లో టీచర్ల అవసరం ఉందో జాబితాలను రూపొందించి సర్దుబాటు చేయాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జరిగిన సర్దుబాటులో లోపాలున్నాయా అనేది చర్చగా ఉంది. ఇప్పటికే సర్దుబాటు జరిగిన టీచర్లలోనుంచి కూడా అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సింటుందని భావిస్తున్నారు. జిల్లాలో 220 మందిని సర్దుబాటు చేశారు.
17 పాఠశాలల్లో టీచర్ల అవసరం..
జిల్లాలో 17 పాఠశాలల్లో టీచర్లు ఇంకా అవసరం ఉందని గుర్తించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపురం జెడ్పీహెచ్‌ఎస్ 1, ఖిలావరంగల్‌లోని ప్రభుత్వ పీఎస్ (మైసయ్యనగర్ )1, మామునూరు పీఎస్ 1, చింతల్ హైస్కూల్ 2, నర్సంపేట మండలం రాజుపేట జెడ్పీహెచ్‌ఎస్ 1, వల్లభ్‌నగర్ ప్రభుత్వ యూపీఎస్ 3, నెక్కొండ మండలం నాగారం జెడ్పీహెచ్‌ఎస్ 3, సంగెం మండలం కాట్రపల్లి జెడ్పీహెచ్‌ఎస్ 1, తీగరాజుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ 1, వరంగల్ నగరంలోని శాంతినగర్ పీఎస్ 1, ప్రతాప్‌నగర్ పీఎస్ 1, చార్‌బౌళి జెడ్పీహెచ్‌ఎస్ 1, ఇంతేజార్‌గంజ్ ప్రభుత్వ హైస్కూల్ 1, కృష్ణా కాలనీ ప్రభుత్వ హైస్కూల్ 1, నరేంద్రనగర్ ప్రభుత్వ హైస్కూల్ 1, బాలాజీనగర్ ప్రభుత్వ యూపీఎస్‌లో ముగ్గురు టీచర్ల అవసరం ఉంది. ఆయా పాఠశాలలకు టీచర్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుందని డైరెక్టర్ ఆదేశించారు.
రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ ఆదేశాలు
సర్దుబాటు ప్రక్రియ ముగిసినా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలల గుర్తింపు
పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జాబితా


