 
															41కిలోల ధాన్యం ఉండేలా చూసుకోవాలి
● డీఆర్‌డీఓ రాంరెడ్డి
రాయపర్తి: బస్తాలో 41 కిలోల ధాన్యం ఉండేలా చూసుకోవాలని, ఎక్కువ ఉంటే కేంద్రం నిర్వాహకులను తొలగిస్తామని డీఆర్‌డీఓ రాంరెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొలన్‌పల్లి, కొండూరు, రాయపర్తి, మైలారం, జేతురాం తండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ జిల్లాలో మొదటగా రాయపర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గతేడాది 24 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పుడా సంఖ్య 48కి పెరిగిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసుకొని మట్టి, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్‌లో ఆర్పీఎం స్పీడు 18 నుంచి 20 వరకు ఉండేలా చూసుకోవాలని, దానివల్ల తాలు పొలంలోనే పడిపోతుందని చెప్పారు. దళారులను నమ్మి ధాన్నాన్ని వారికి విక్రయించవద్దని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరతోపాటు సన్నధాన్యానికి రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎస్‌ఓ కిష్టయ్య, సివిల్ సప్లయ్ డీఎం సంధ్యారాణి, డీపీఎం దాసు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, ఏంపీఎ రవీందర్, ఏఓ గుమ్మడి వీరభద్రం, సీసీలు, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ రామచంర్రారెడ్ది, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, పాలకుర్తి సోమానాథాలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
