అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌తో అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్ల కుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్‌గా ఉండాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు ఉండాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు, చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, భవనాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
న్యూశ్యాయంపేట: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండలస్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 18004253424 టోల్ ఫ్రీనంబర్, 9154252936 నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఉదృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, చెరువుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి


