 
															విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి కోసం ఇంటర్ బోర్డు పలు అధునాతన సాంకేతిక సేవలను ప్రారంభించిందని ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు ఆధునిక సేవలను వివరించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) ప్రారంభించినట్లు తెలిపారు. హాజరు విధానాన్ని అధునాతన సాంకేతిక పద్ధతిలో ఇంటర్ విద్యావిభాగం అవలంబిస్తోందని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా టైంటేబుల్, టీచింగ్ డైరీ నమోదుతో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్‌లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలల్లో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గూగుల్ మీట్‌లో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
