 
															రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్/వేలేరు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారంలో, వేలేరు మండలం పీచరలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూకం, తేమ విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో 17శాతం లోపు తేమ ఉండేలా రైతులు చూసుకోవాలని కోరారు. ఐకేపీ నిర్వాహకులు బస్తా 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని సూచించారు. గత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల సంక్షేమన్ని పట్టించుకోలేదని అన్నారు. రెండేళ్లలో రూ.1,388 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకు వచ్చానని తెలిపారు. ముప్పారంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. మడికొండ నుంచి నారాయణగిరి, నారాయణగిరి నుంచి కొత్తకొండ వరకు మొత్తం 16.70 కిలోమీటర్ల పొడవు డబుల్ రోడ్డుకు రూ.24.25కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వచ్చే వానాకాలం నాటికి లిఫ్ట్–1 పనులు పూర్తిచేసి వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తానన్నారు. పీచర గ్రామంలో రూ.83 లక్షలతో సీసీ రోడ్ల పనులు పూర్తిచేశామని, 65 ఇందిరమ్మ ఇళ్లు గ్రామానికి ఇచ్చామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వేలేరు వయా శాలపల్లి నుంచి పీచర వరకు రూ.6 కోట్లు, పీచర, వయా మద్దెలగూడెం కొమ్ముగుట్ట వరకు రూ.3 కోట్లు, పీచర నుంచి వావిల్లకుంట తండా వరకు రూ.1కోటి42 లక్షల నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ మేన శ్రీను, సివిల్ సప్లయీస్ డీఎం మహేందర్, వ్యవశాయ శాఖ ఏడీ ఆదిరెడ్డి, డీపీఎం రాజేంద్రప్రసాద్, డీఎంపీఎస్ మహేందర్, తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీఓ అనిల్ కుమార్, కవిత, ఏఈఓ నవ్య, నాయకులు కత్తి సంపత్, బిల్లా యాదగిరి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
