 
															పరకాల అభివృద్ధే లక్ష్యం..
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల : ప్రణాళికబద్ధంగా పరకాల పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి రంగంలో పరకాల పట్టణం వెనకబడిందని ఆయన పేర్కొన్నారు. వర్షపు నీరు వెళ్లే డ్రెయినేజి వ్యవస్థను అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సోమవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 1,2,13,14 వార్డుల్లో చేపట్టిన డ్రెయినేజి, పారిశుద్ధ్య, రోడ్డు నిర్మాణాలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయని మండిపడ్డారు. 3,4,6 జోన్లలో మొదటి విడతగా, 1,2,5 జోన్లలో రెండోవిడతగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అదే విధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, టాప్క్, ఇండోర్ స్టేడియం అభివృద్ధి, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, ఏఈ రంజిత్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
