 
															దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించిన భూ భారతి, పీఓబీ రికార్డులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పారదర్శకత కీలకమన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు రాజేశ్వర్, విజయ్‌సాగర్, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
