 
															డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో?
సాక్షి, వరంగల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఉత్కంఠ రేపుతోంది. డీసీసీ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలో తమ సేవల గురించి ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులకు సమర్పించిన దరఖాస్తుల్లో వివరించారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధన ఆధారంగా ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్ వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు, నాయకులు నుంచి అభిప్రాయాలు సేకరించారు. జిల్లా నుంచే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. ఈ ముఖ్య నేతల మధ్య సయోధ్య అంత పెద్దగా లేకపోవడంతో డీసీసీ పీఠం ఎవరికి వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తల అభిప్రాయం మేరకే అధ్యక్షుల ఎంపిక అని ఏఐసీసీ పరిశీలకులు చెబుతున్నారు. తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ఎవరికీ వారు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండడం, డీసీసీ అధ్యక్ష ఎంపికలపై ఏఐసీసీతో సంప్రదింపులు జరిపితే క్లారిటీ వస్తుందని ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రస్తుతమున్న డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు మరోసారి అవకాశం ఇవ్వాలని జిల్లాలోని కొందరు ముఖ్యులు ఏఐసీసీ పరిశీలకులకు లిఖితపూర్వకంగా లేఖలు కూడా ఇచ్చారు. ఈమెతోపాటు మీసాల ప్రకాశ్, నవీన్‌రాజ్, అయూబ్ ఖాన్, పోశాల పద్మ, దేవేందర్‌రావు, పిన్నింటి అనిల్ రావు, భాషపాక సదానందంతో పాటు మరికొందరు కూడా డీసీసీ రేసులో ఉన్నారు. ఇలా 40 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరులు ఉండడంతో తమవారికే వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు, అబ్జర్వర్లు ఆరుగురి పేర్లను ఫైనల్ చేసి పీసీసీకి, ఢిల్లీ అధిష్టానానికి పంపారు. వర్ధన్నపేట నుంచి ఎర్రబెల్లి స్వర్ణ, బొంపల్లి దేవేందర్‌రావు, అనిల్‌రావు పేర్లు వినిపిస్తున్నాయి. 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్‌రావు పేరును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా ప్రతిపాదించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే, కొండా దంపతులు ప్రతిపాదించిన నవీన్‌రాజ్‌కు ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉండాలన్న నిబంధన అడ్డుగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజనాల శ్రీహరి, పోశాల పద్మకు సైతం ఇదే అడ్డు కానుంది. ఇప్పటి వరకు పార్టీని వీడకుండా ఉన్న వారిలో ఎర్రబెల్లి స్వర్ణ, దేవేందర్‌రావు, మీసాల ప్రకాశ్‌తో పాటు మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికీ వచ్చినా అందరిని సమన్వయం చేస్తూ ముందుకు సాగడమనేది కత్తిమీద సామేనని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
పీఠం దక్కించుకునేందుకు
ఆశావహుల ప్రయత్నాలు
ఇప్పటికే క్షేత్రస్థాయిలో
పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు
కార్యకర్తలు, ముఖ్య నాయకుల
అభిప్రాయాల సేకరణ
ఇప్పటికే అధిష్టానం వద్దకు చేరిన
తుది జాబితా
 
							డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
