 
															గుడిసెవాసులకు న్యాయం చేస్తాం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● వర్ధన్నపేటలో తహసీల్దార్
కార్యాలయం, పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తనిఖీ
వర్ధన్నపేట: గుడిసెవాసులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం, పౌరసరఫరాల శాఖ గిడ్డంగిని శనివారం ఆమె సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి నిర్వహణ, భూముల వివరాలు, రైతుల సమస్యలపై ఆరా తీశారు. అక్కడే వేచి చూస్తున్న ల్యాబర్తి గ్రామానికి చెందిన బుడిగ జంగాలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 555లో తమ తాతాముత్తాతల కాలం నాటి నుంచి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఆ భూమికి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి నేరుగా పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రాంతంలో ఉన్న పౌరసరఫరాల గిడ్డంగి వద్దకు తనిఖీ చేయడానికి వెళ్లారు. గిడ్డంగికి తాళం వేసి ఉండడంతో ఒకింత ఆశ్చర్యానికి గురై వెంటనే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గిడ్డంగి ఇన్‌చార్జ్‌తోపాటు సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ విజయసాగర్, సిబ్బంది ఉన్నారు.
గిడ్డంగిని సందర్శించిన డీఎం
కలెక్టర్ ఆదేశాలతో డీఎం సంధ్యారాణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ శ్రుతివర్షిణి గిడ్డంగిని సందర్శించారు. రికార్డులు, స్టాక్ రిజిష్టర్, బియ్యం నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
