 
															భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
● ఊకల్‌లో సుబ్రహ్మణ్యస్వామికి పూజలు
గీసుకొండ: నాగుల చవితిని పురస్కరించుకొని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా బంతి పూలతో అలంకరించారు. మహిళలు పుట్టలో పాలు పోసి సంతాన ప్రాప్తి కలగాలని, సకల దోషాలు తొలగిపోవాలని మొక్కుకున్నారు. సర్ప శాపానికి గురికాకుండా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. 40 రోజులపాటు సుబ్రహ్మణ్య దీక్షలు చేపట్టిన సుమారు వంద మంది మంగళవాయిద్యాలతో తరలివచ్చి స్వామివారికి దివ్యాభిషేకం చేశారు. అనంతరం దీక్షలు విరమించారు. ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకుడు శ్రీహర్ష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు హారతి ఇచ్చారు. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి మొక్కుకున్నారు. ఎంపీఓ పాక శ్రీనివాస్, ఏపీడీ శ్రీవాణి, జీపీఓ కల్యాణిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, ప్రశాంత్, స్వప్న, సునీత, ప్రవీణ్, ఈసీ శ్రీలత పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్‌రావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, రాజు, కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాట్లు చేశారు.
 
							భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
