 
															జోరుగా.. మూడు ముక్కలాట
సాక్షి ప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం:
ప్రభుత్వం నిషేధించిన మూడు ముక్కలాట వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకులు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పండ్లతోటలు అడ్డాలుగా ఏర్పాటుచేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, మహిళలు కూడా తామేం తక్కువ అన్నరీతిలో పేకాటలో మునిగి తేలుతున్నారు. ఏకంగా చట్ట సభలకు ప్రాతినిఽథ్యం వహించిన నేతలు సైతం పేకాడుతూ ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడడం గమనార్హం.
స్థానిక పోలీసులకు సమాచారం కరువు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాగుతున్న పేకాట సమాచారం స్థానిక పోలీసులకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పేకాట, వ్యభిచారం, గుట్కా, సట్టా, మట్కా తదితర దందాల సమాచారం స్థానిక పోలీసులకు రాకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వస్తుండడం గమనార్హం. దీనిని బట్టి స్థానిక పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు కొన్ని పోలీస్ స్టేషన్లలో భూముల పంచాయితీలు తప్ప మరే విషయాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ అధికారులు సైతం మొద్దు నిద్ర వహించడంతో స్థానిక పోలీసులు వారికి ఇష్టమైన అంశాల్లోనే పోలీసింగ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఖరీదైన అపార్ట్‌మెంట్లలో..
ఖరీదైన అపార్ట్‌మెంట్లలో పేకాట శిబిరాలు ఇటీవల ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌లలో ఎక్కువ కుటుంబాలు కిరాయికి ఉంటాయి. అందులో పేకాడేందుకు బంధువుల మాదిరిగా ఇంట్లోకి చేరుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి ఆట డబ్బులను ఖర్చులకు తీసి అందులోనుంచి మద్యం, మటన్‌తోపాటు అన్ని రకాల వంటలు చేసి మూడు ముక్కల ఆటను మజా చేస్తున్నారు. ఇలాంటి శిబిరాల్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటున్నట్లు సమాచారం.
ఇటీవల పట్టుబడిన మరికొన్ని ఘటనలు..
● ఈనెల 10న ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి వరంగల్ చౌరస్తాలోని వినాయక గ్రాండ్ హోటల్‌లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీ సులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.27,940 నగదు, 9 సెల్ ఫోన్లు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
● సెప్టెంబర్ 19న ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మామిడి తోటలో పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారినుంచి రూ.15,110 నగదుతోపాటు, 4 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
● సెప్టెంబర్ 15న కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కటకం సుధాకర్ షాపులో పేకాడు తూ ఏడుగురు పట్టుబడ్డారు. రూ.27,220 నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● సెప్టెంబర్ 15న మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.7,070 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● సెప్టెంబర్ 10న మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడిచేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారినుంచి రూ.7,330 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● గత నెల 9న కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల సమ్మిరెడ్డి పౌల్ట్రీఫాంలో శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసి, రూ.22,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్ పరిధిలో
రెచ్చిపోతున్న పేకాటరాయుళ్లు
రూ.లక్షలు పెట్టి పత్తాలాట
అపార్ట్‌మెంట్లు, ప్రముఖుల ఇళ్లు,
పండ్ల తోటలే అడ్డాలు
‘టాస్క్‌ఫోర్స్’కు పట్టుబడుతున్న
రాజకీయ ప్రముఖులు
మహిళలు సైతం పట్టుబడుతున్న వైనం
దృష్టి సారించని స్థానిక పోలీసులు
ఈ నెల 20న : వరంగల్ సబ్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట అడుతూ 13మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు దోనెపూడి రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు. వీరినుంచి రూ.3.68లక్షల నగదు, 11సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 12న : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్‌రెడ్డితో పాటు 11 మంది పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. రూ.60,610 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 19న : హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీనివాస్ కాలనీలో నందికొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పేకాడుతూ 11 మంది పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖ వ్యాపారులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు భీరం సుధాకర్‌రెడ్డి పట్టుబడ్డారు. 30 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరినుంచి రూ.1,27,650 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇలా.. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకుల ఇళ్లు అయితే పోలీసులు రారు అనే ధీమాతో పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి పురుషులు, మహిళలు కలిసి మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలకు వెళ్లే పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నప్పటికీ చివరికి కేసులనుంచి తప్పించుకోలేకపోతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
