 
															యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా ఉద్యాన శాఖ అధికారి
శ్రీనివాసరావు
ఖానాపురం: ఆయిల్‌పామ్ పంటలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. మండల కేంద్రంలో ఆయిల్‌పామ్ పంటలను మంగళవారం ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5,950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నట్లు తెలిపారు. సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు రోజూ పంటకు రైతులు నీళ్లు పెడుతున్నారని చెప్పారు. వేర్లు అడుగు భాగంలోనే ఉన్నందున అరగంట కంటే ఎక్కువగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. నత్రజని, పొటాష్, భాస్వరాన్ని విడతలుగా పదిపదిహేను రోజులకోసారి వేసుకోవాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఒరాన్, మెగ్నీషియం సల్ఫేట్‌ను కొద్ది కొద్దిగా డ్రిప్‌ల ద్వారా పంటలకు అందజేస్తే మొక్క ఎదుగుదలతో పాటు నాణ్యమైన గెలలు వస్తాయని వివరించారు. రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే సూచనలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ బోగ శ్రీనివాస్, రైతులు గొల్లపూడి సుబ్బారావు, బొప్పిడి పూర్ణచందర్‌రావు, రాగం సాంబయ్య, వేముల వెంకటేశ్వర్‌రావు, పరుచూరి ద్విజేంద్ర, కోగంటి సత్యనారాయణ, పల్లెపాటి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
